కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు
11 వ శతాబ్దం నాటి కల్హణ విరచితమైన ’కశ్మీర రాజతరంగిణి’ ఆధారంగా రాసిన 16 కథలు.
రచయిత: కస్తూరి మురళీ కృష్ణ
ప్రచురించిన వారి చిరునామా:
ఎమెస్కో బుక్స్
సూర్యారావు పేట, విజయవాడ - 520 002.
ధర: 90/-
2010 జనవరి లో డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ లో జరిగిన చర్చా సమీక్ష. సమీక్ష రాసి పంపిన వారు: అడుసుమిల్లి శివ
2008 లో అనుకుంటా. విజయవాడలో నా సెలవుల ఆఖరు రోజున యధావిధిగా ఎమెస్కో వారి దుకాణానికి వెళ్ళాను. అక్కడ వెదుకుతూ ఉండగా ఎరుపు నలువు రంగుల్లో చాలా అందంగా ఉన్న ఒక పుస్తకం కనబడింది. తీసి చూస్తే కల్హణ కశ్మీర రాజతరంగిణి... అని కనపడగానే చాలా సంతోషం వేసింది. ఎన్నాళ్ళగానో చదవాలనుకుంటున్న ఒక పుస్తకం కనపడిన ఆనందం అన్నమాట. వెనుక అట్టమీద రచయిత పరిచయం, తిరగేస్తూ ఉంటే కనబడిన బొమ్మలు చాలా బాగా నచ్చి కొనుక్కొని నాతో తెచ్చుకున్నాను. మా డిట్రాయిట్ వచ్చేసరికి దాదాపు చదివేశాను. శైలి ఒక చిన్న ప్రవాహం లాగా అందంగా సాగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చదువుతూ చదువుతూ ఒక రకమయిన ఉద్వేగానికి లోనయ్యాను. ఈ నాడు కళ్ళముందు కనపడుతున్న అనేక విషయాలను ఎప్పుడో 11 వ శతాబ్దం నాటి కల్హణుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు కదా అనుకున్నాను.
మా DTLC 2009లో చదివే పుస్తకాల జాబితాలో చేర్చుదామనుకున్నా కాని కుదరలేదు. 2010 పుస్తకాల జాబితాలో చేర్చాము. పోయిన డిశెంబరు చివర్లో అనుకుంటా మద్దిపాటి కృష్ణారావు గారు ఫోను చేసి ఈ పుస్తకం సిఫారసు చేసింది మీరే కదా మరి మీరే దీనికి ముఖ్య చదువరి గా ఉండండి అంటే హుషారుగా ఒప్పేసుకున్నాను (ముఖ్య చదువరి అంటే చర్చ ప్రారంభించి, చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయాలు సేకరించి, చర్చా సారాంశాన్ని సమీక్షగా రాసే సభ్యుడు). కాని ఆ ఆనందం, ఆ హుషారు చాలా short lived మాత్రమే అని ఒక కలము కాగితము పక్కన పెట్టుకొని ప్రశాంతంగా చదువుతూంటే గాని తెలియలేదు.
ఒక పుస్తకం పేరు వల్లకాని, రచయిత పేరు వల్ల కాని, లేదా అందమయిన అట్టవల్లకాని, అట్టవెనుక ఉన్న పరిచయ వాక్యాలవల్ల కాని, లేదా దానిలో ఉన్న విషయం పట్ల మనకున్న ఆసక్తి వల్ల కాని మనం ఆకర్షితులమయి పుస్తకం కొని తెచ్చుకొని చదవటం మొదలు పెడతాము. ఒక సారి పుస్తకం తెరిచిన తర్వాత మనల్ని ముందుకు నడిపించే బాధ్యత పూర్తిగా రచయితదే కదా! మనలను చేయి పట్టుకొని భద్రంగా నడిపించే బాధ్యత రచయిత చేతిలో పెట్టాక ఇంక మనం ఆ పుస్తకం లోని మాధుర్యాలను ఆస్వాదించడానికి సిద్దపడతాము.
కాని ఇక్కడ జరిగిందేమిటంటే ఎంతో దూరం ప్రయాణించకముందే, అంటే ఇంకా మొదటి కథ కూడ పూర్తికాకముందే తలకు బొప్పికట్టడాలు, కాళ్ళకు ఎదురుదెబ్బలు తగలడాలు, మోకాలు చిప్పలు పగలడాలు వగయిరాలు జరిగేసరికి ఇంక రచయిత మనలను భద్రంగా నడిపిస్తాడు అన్న నమ్మకం సడలిపోతుంది. ఇంకేముంది. ఇక దృష్టి అంతా కూడ జాగ్రత్త మీదకు మళ్ళి ఎదురుదెబ్బలు తగలకుండా కాపాడుకునే ప్రయత్నంలో దారిలో అక్కడక్కడా ఉన్నసుమాల సౌరభాన్ని గాని, నేతిగిన్నెల్లో దొరికిన మాధుర్యాన్ని గాని ఆస్వాదించలేక పోతాము. అలసిసొలసిన బాటసారులం హుష్షో హష్షో అనుకుంటూ ఒకచోట చేరినప్పుడు అదుగో అక్కడ ఒక గిన్నెలో తేనె ఉంది చూశారా అని ఎవరైనా అడిగినా కష్టపడి గుర్తు తెచ్చుకునో, లేదా వారి సాయంతో అక్కడకు జాగ్రత్తగా వెనక్కు వెళ్ళో చూడాల్సి వస్తుంది.
మొత్తానికి ప్రయాణం ముగించడానికే శక్తి యుక్తులన్నీ ఖర్చయిపోతాయి.
టూకీగా ఇదీ సంగతి.
కొంచెం వివరంగా....
ఒక మంచి ఎడిటరు లేని లోపమయితే కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఒక మంచి ఎడిటరు ఉండి ఉన్నట్లయితే, ప్రతి పేజీలో ఉన్న ఎన్నో అచ్చుతప్పులూ, అసంబద్ధవాక్యాలూ, ముఖ్యంగా చాలా చోట్ల prepositions miss అయ్యాయి, ఇవన్నీ కూడ సరిచేసుకునే అవకాశం ఉండేదేమో. అట్ట మీద ఒక సగంలో ప్రాచీనానికి చిహ్నంగా నలుపు రంగులో ఒక శిల్పము, మిగతా సగంలో ఆధునికతకు చిహ్నంగా ఎరుపు రంగు చక్కగా ఉన్నాయి. లోపల మాత్రం ఎక్కడా కూడా కల్హణుడికీ, కస్తూరి వారికీ మధ్యన గీత దాదాపు కనపడలేదు. ఏది చరిత్ర, ఏది కల్పితం అంతా అయోమయం. ఇక ఇందులో పేర్కొన్న సంవత్సరాలు, చరిత్ర, బౌద్ధం అంతా ఇంకా పెద్ద గందరగోళం. ఈ గందరగోళం లో పడి ఉన్న కొన్ని మంచి కథలు కూడ మరుగున పడిపోయాయి.
ఉదాహరణకు, బుద్దుడు పుట్టినది 400-600 BCE మధ్య కాలంలో అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి కస్తూరి వారు క్రీ.పూ 1887 అని చెప్తారు. నలుగురితో నారాయణ అనాలంటే ఎక్కువ వివరణలు అవసరం లేదు. కాని ఇలా పూర్తిగా విభేదించేప్పుడు కొంచెం footnotes లాగ ఏమయినా ఇచ్చి ఉంటే, మాబోంట్లకు ఈ అయోమయం తప్పేది కదా!!
ఇంకొంచెం వివరంగా:
9 పేజీ: "బలరాముడు జరాసంధునికి సహాయంగా కశ్మీర సైన్యంపై విరుచుకు పడ్డాడు"........... ఢాం
బహుశః రచయిత ఉద్దేశ్యం సహాయంగా వచ్చిన ...... అని అనుకుంటా
10 పేజీ: తురుష్క అంటే మహమ్మదీయ మతం కాదు అని వివరణ ఇచ్చారు బాగానే ఉంది. కాని మళ్ళీ తర్వాత్తర్వాత అదే తురుష్క పదాన్ని మహమ్మదీయ మతానికి ప్రత్యామ్నాయంగా వాడారు.
12 పేజీ: "ఇంతలో మరో వార్త ".
అసలు ఒక వార్త ఉన్నప్పుడు కదా మరో వార్త ఉండేది.
"శ్రీకృష్ణమంత్రి నుంచి" అంటారు. అంటే శ్రీకృష్ణ అనే మంత్రా? లేక శ్రీకృష్ణుని మంత్రా?
16 పేజీ:
"తుఫాను అలల తాకిడికి నావ వణికినట్లు" ... ఈ ప్రయోగం కొంచెం ఎబ్బెట్టుగా లేదూ!
ఒక సంభాషణ చెప్పినప్పుడు " " మధ్యన ఉన్నది ఒక పేరాలో ఉంటే, దాని స్పందన మరొక పేరాలో ఉంటే బాగుండేదేమో! పుస్తకమంతా కూడా ఇలానే సాగింది.
17 పేజీ :
"శౌర్యంలో నరేంద్రుడంతటి వాడు ".
ఈ నరేంద్రుడు ఎవరండీ? నరేంద్రుడు అంటేనే నరులలో ఇంద్రుడంతటి వాడు అన్న ఒక పొగడ్త కదా. మరింక ఈ ప్రయోగం?
25 పేజీ :
క్రీ.పూ.15 వ శతాబ్దం అంటారు. మళ్ళీ తుర్కీ నుంచి వచ్చిన బౌద్ద పండిత మహారాజు అంటారు. అందరికీ తెలిసిన బుద్దుడి కాలం 6 - 4 శతాబ్దాల మధ్య కదా. ఇక్కడ వివరణ లాంటిది ఇచ్చి ఉండాలిసిందేమో!!
33 వపేజీ
"చిన్న సముద్రమంత సరస్సు" :)
"గోనందుని నుండి లవ మహారాజు వరకు 35 మంది రాజులు పాలించారు. తర్వాత కుశుడు, ఖగేంద్రుడు, సురేంద్రుడు రాజయ్యారు. " రాజులయ్యారు కాబోలు...
"శచీనరుని తర్వాత గాంధారి సోదరుడి మునిమనుమడు ’అశోక చక్రవర్తి రాజయ్యాడు."
"దామోదరుడు కృష్ణుని సుదర్శనానికి బలయ్యాడు. అతని కొడుకు గోనందుడు మొదలుకొని లవుడి వరకు 35 రాజులు పాలించారు. తర్వాత కుశుడు, ఖగేంద్రుడు, సురేంద్రుడు, గోధరుడు, సువర్ణ మహారాజు, జనకుడు, శచీ నరుడు"
... అంటే 42 మంది రాజులయ్యారు. తర్వాత శకుని ముని మనుమడు అశోకుడు? 42 మంది రాజులు, సుమారు 1500 సంవత్సరాలు గడిచాయి. ఇంకా శకుని ముని మనుమడు? మేము ఏదో miss అయినట్లున్నాము ఇక్కడ. లేదా ఇంత అసమంజసమా?
36 వపేజీ
మ్లేచ్చులు అంటే వేదభ్రష్టులయిన భారతీయులు అని చెప్పారు. అంటే అశోకుడు కూడ మ్లేచ్చుడేనా?
37 పేజీ:
బౌద్ధులు అంతా సన్యాసులు అంటారు. మళ్ళీ రాజు, ఇంకా ఊళ్ళో అంతా బౌద్దులు అంటారు. ఎలా సాధ్యం?
జలౌక మహారాజు అద్భుత జీవితం.
46 పేజీ:
మళ్ళీ సంవత్సరాల అయోమయం. కథ బాగున్నా కానీ ఇది చరిత్రా, కల్పనా అన్న మీమాంస ఎక్కువ అయి ఆనందించలేక పోయాము.
66 పేజీ:
నౌకా యానాలు? పర్వతాల మధ్యన ఉన్న కశ్మీర నదులు నౌకాయానానికి అనుకూలమయినవేనా? ఒక వేళ అయి ఉంటే కొంచెం వివరణ ఉపయోగపడేది.
67 పేజీ:
మొలచిన గడ్డిగింజలు తినడం. మొలిస్తే ఇక గింజలెక్కడ?
68 పేజీ:
"వడగండ్ల వాన కురిపించి పంటలను పండించి"
??? వడగండ్ల వాన పడితే పంటలు నాశనం అవుతాయి కదా!!
68 పేజీ:
"నరుడు అనబడే కిన్నరుడు "
అన్నారు బాగానే ఉంది. కాని ఒకసారి నరుడు, మరొకసారి కిన్నరుడు అంటూ మార్చి వాడేసరికి చాలా ఇబ్బంది అనిపించింది.
72 పేజీ: "బండలు పడ్డ అయిదు ఆమడల వైశాల్యం వరకూ గ్రామాలు అరణ్యాలుగా మారిపోయాయి" . అయ్యా!! ఎలా??
82 వ పేజీ:
"స్వధర్మం, కర్తవ్యం అయిన ధర్మయుద్దం చేయకపోతే ధర్మహాని.. కర్తవ్యలోపం వంటి పాపాలు చేసినట్లు అవుతుందని భగవదాజ్ఞ " .
ఎక్కడ స్వామీ! "స్వధర్మో నిగుణం శ్రేయః.... " దీని అర్థమా ఇది??
101 పేజీ:
"పక్షిని ఈదమనడం, చేపను గాలిలో ఎగరమనడం మూర్ఖత్వం".
ఏమి చెప్పదలిచారు ఇక్కడ?
129 పేజీ:
"భోజరాజు జయించి ఆక్రమించిన ధక్కేయ వంశపు రాజు రాజ్యాన్ని గెలుచుకొని మళ్ళీ రాజ్యాన్ని ధక్కేయులకే అప్పగించారు. "
నాకయితే అస్సలు అర్థం కాలేదు. అజ్ఞానానికి మన్నించండి.
145 పేజీ:
"భారతీయ ధర్మంలో స్త్రీ అబల అని నిరూపిస్తుంది సావిత్రి." --మళ్ళీ ఢాం
ఇంక ఇది కేవలం తప్పుల పట్టిక లాగ అవుతోంది. ఇక ఇక్కడికి చాలిస్తాను.
ముగించేముందు నాకు నచ్చిన ఒక పేరా
" భూమిపై మొలచి ఆకాశాన్నంటేట్లు ఎదిగిన ఈ చెట్లు మనిషి సాధన ద్వారా మనీషిగా ఎదగవచ్చన్న నిజాన్ని మౌనంగా ప్రదర్శిస్తున్నాయి. అంతేకాదు ఒక రాజు ఎంత ఎదిగినా అతని వ్రేళ్ళు భూమి మీదనే ఉండాలని, సామాన్యులను కూడా అతను గౌరవించాలనీ సూచిస్తున్నాయా చెట్లు. ఎందుకంటే సామాన్యుల రాజభక్తే రాజు శక్తి."
మా DTLC సమావేశాల్లో ఒక పుస్తకాన్ని సమీక్షించడానికి కూర్చున్నప్పుడు సాధారణంగా కొంతమందికి బాగ నచ్చి కొంతమందికి నచ్చక మాంచి వాద ప్రతివాదాలు నడుస్తాయి. ఎవరి వాదాన్ని, ఎవరి పరిశీలనను వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటే మా లైబ్రరీ వాళ్ళు ఇంక మూసేస్తున్నాము అనేదాక అస్సలు 3 గంటల సమయం గడచినట్లే తెలిసేది కాదు. కాని ఈ పుస్తకం విషయానికి వచ్చేసరికి అందరిదీ ఏకాభిప్రాయమే. ఎప్పుడూ లేనిది మాకు సమయం కూడ మిగిలిపోయింది. ఆ ఏకాభిప్రాయాన్నే ఐదవ పేజీలో కస్తూరి వారు స్వయంగా ఇచ్చిన అనుమతి మేరకు ఇక్కడ టూకీగా తెలియజెప్పే ప్రయత్నం చేశాను.
No comments:
Post a Comment