Wednesday, January 25, 2012

ఈమధ్య ఎటు చూసినా రికార్డుల గోల వినిపిస్తోంది కదా.. మరి కొన్ని ఆణిముత్యాల రికార్డులు చూద్దామా. చూసాక మళ్లీ ఆలోచిద్దాము నిజమయిన All time record ఏదో.
  • మన మొదటి సినిమా భక్త ప్రహ్లాద  (మాటలున్న సినిమా ) 15-09-1931 న విడుదలయింది.
  • సినిమా అంటే పౌరాణికమే అనుకునే ఆరోజుల్లో ఒక విప్లవాత్మకమయిన కథను తీసుకోని ఎంతో ధైర్యంగా నిర్మించారు గూడవల్లి రామబ్రహ్మం గారు మాలపిల్ల అనే సినిమాని. ఒకేసారి 12 కేంద్రాల్లో తెలుగు వారి 50 వ చిత్రంగా 25-09-1938 న విడుదలయింది. ఇది అప్పటికి రికార్డు.
  • రజతోత్సవం జరుపుకున్న (థియేటరు మార్చి )తొలి చిత్రం 26-02-1948 న విడుదలైన మన అక్కినేని నటించిన  బాలరాజు. ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు చూసి ఎంతో మంది కొత్తకొత్త థియేటర్లు కట్టారు.
  • 15-03-1951 ఒక మరపు రాని రోజు. అ రోజు విడుదలైన పాతాళభైరవి అన్ని రికార్డుల దుమ్ము దులిపేసింది. విడుదలైన ఆ రోజు నుంచి ఇప్పటి దాక తెలుగునాట ఎక్కడో ఒక చోట ఆ సినిమా ప్రదర్శిత మౌతూనే ఉన్నదనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదేమో.
    మొదటి విడతగా 13 ప్రింట్లతో విడుదల చేస్తే, 10 కేంద్రాల్లో శతదినోత్సవం, 4 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకొని, 200 రోజులు ఆడిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఒకే థియేటరులో రజతోత్సవం చేసుకొన్న మొట్టమొదటి తెలుగు సినిమా. ఇప్పటి వరకు దాదాపు 500 ప్రింట్లు వేసారు. 2 డూపు నెగటివ్ లు వేసారు.
    బహుశా మలి విడతలో ఇన్ని ప్రింట్లు తీసిన సినిమా కూడా ఇదే అనుకుంటా..
  • 26 జూన్ 1953 న అక్కినేని దేవదాసు విడుదలయి వీర విహారం చేసింది. అప్పుడే కాదు. 1974 డిసెంబరు లో హైదరాబాదు సుదర్శన్ లో ఉదయం ఆటలుగా విడుదల అయి, 28 రోజులు హౌస్ ఫుల్ గా 250 రోజులు ఆడింది. (200  రోజులు సుదర్శన్ లో 62  రోజులు శేష్ మహల్ లో.)
  •   1955 జనవరి 12 న తెలుగు సినీ వినీలాకాశంలో మరో మెరుపు మెరిసింది. ఆ రోజు మిస్సమ్మ విడుదలయింది. 13 కేంద్రాల్లో వంద రోజులాడింది. (అప్పటి ఎ క్లాసు సెంటర్లు కేవలం పాతిక మాత్రమే). ఇప్పుడు చూసినా కూడా కొత్త సినిమా అనిపిస్తుంది...:)
  • 14 ఏప్రెల్ 1955 న విడుదలయిన రోజులు మారాయి హైదరాబాదులో వంద రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా. ఈ సినిమా శతదినోత్సవసభలో మాట్లాడుతూ అప్పటి హైదరాబాదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండా రంగారెడ్డి గారు "ఇక్కడ స్టూడియో నిర్మించి హిందీ తెలుగు భాషల్లో సినిమాలు తీస్తే స్థానిక కళాకారులకు పని దోరకుతుంది కదా" అని సూచించారు. ఆ స్ఫూర్తితో యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారు సారధి స్టూడియో నిర్మించారు.
  • మార్చ్ 27, 1957 ప్రపంచ సినీ జగత్తులో తెలుగు వాడు ఛాతీ విరుచుకొని ఇది మా సినిమా అని సగర్వంగా చెప్పుకొనే సినిమా మాయా బజార్ విడుదల అయింది. 15 కేంద్రాల్లో వంద రోజులాడింది. ఈ మధ్య రంగుల్లో మార్చి విడుదల చేస్తే ప్రసాద్ లో వంద రోజులాడింది. మాయా బజార్ గురించి తెలుగు వాళ్లకు చెప్దామనుకోవడం "అమ్మ పుట్టింటి గొప్పలు మేనమామకు చెప్పినట్లుంటుంది" కదా..
  • 9 జనవరి 1960 న NTR  నటించిన శ్రీ వేంకటెశ్వరమహాత్మ్యం  20 కేంద్రాల్లో విడుదల అయి 16 కేంద్రాల్లో శత దినోత్సవం, ఒక కేంద్రంలో రజతోత్సవం చేసుకుంది.
  • 9  ఆగస్టు 1961 న విడుదల అయిన జగదేక వీరుని కథ (అప్పటికి అది very high budget cinema) అప్పటి అన్ని రికార్డులను బద్దలు కొట్టి వీర విహారం చేసింది.  తొలి విడుతగా 18 కేంద్రాల్లో వందరోజులాడింది. తర్వాత బాచ్ తో కలిపి మొత్తం 25 -30 కేంద్రాల్లో వందరోజులాడింది. అంతే కాక 5  భాషల్లోకి అనువదించబడి అన్ని చోట్లా విజయదుందుభి మోగించింది.
  • 7జూన్ 1962 న నటరత్న 100 వ సినిమా, NTR ANR కలిసి నటించిన 10 వ సినిమా గుండమ్మ కథ విడుదల అయింది. ఇంక తర్వాత అంతా చరిత్రే.
  • 1962 లోనే విడుదల అయిన మరో ఆణిముత్యం రక్త సంబంధం. అప్పుడు 11 కేంద్రాల్లో వంద రోజులు ఆడటమే కాక 1988 లో మళ్లీ హైదరాబాదులో  విడుదల అయి వంద రోజులాడింది.
  • 1962 లో NTR  నటించిన 10 సినిమాలు విడుదల అయితే, అందులో 8  శత  దినోత్సవం, ఒకటి రజతోత్సవం జరుపుకున్నాయి.
  • 29  మార్చ్ 1963 న మరో ఆణిముత్యం లవకుశ  విడుదల అయి రికార్డుల చరిత్రనే తిరుగ రాసింది.
    ఇది ఆంధ్రలోనే కాక భారతీయ సినీ జగత్తులోనే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది.
    ఒక సినిమా సంవత్సరం పాటు ఒకే థియేటర్ లో ఆడడమన్నది 'లవకుశ' తోనే మొదలయింది.
    62 కేంద్రాల్లో 
    శత దినోత్సవం, 18 కేంద్రాల్లో రజతోత్సవం చివరికి 75 వారాలు ఆడిన తొలి తెలుగు సినిమా.
    అంతేకాక తమిళంలో 250 రోజులు, హిందీలో 200 రోజులు పైగా ఆడింది.
    కర్ణాటకలో తెలుగు సినిమానే 1963 లో 35 వారాలు, 1977 , 1980 లో 100 రోజులు ఇలా మూడు సార్లు 
    శత దినోత్సవం జరుపుకున్న సినిమా ఇంకొకటి లేదేమో.
    అప్పటి మన రాష్ట్ర జనాభా  3 కోట్లు కాగా ఈ సినిమా 60 వారాల ప్రకటనలో ఇచ్చిన వివరాల ప్రకారం 100 కేంద్రాల్లో కోటి 98 లక్షల మంది చూశారు. 1964 జనవరి 1 న వరంగల్ రాజరాజేశ్వరి థియేటర్ వారు ఇచ్చిన ప్రకటన ప్రకారం  వాళ్ళ దియేటర్లో 261 రోజులు ప్రదర్శించినప్పటికి చూసిన ప్రేక్షకుల సంఖ్య 434000 . అప్పటి వరంగల్ జనాభా లక్ష లోపే.
    అవి మరి రికార్డులంటే.
    రిపీట్ రన్, చూసిన, చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య అన్నీ చూస్తె లవకుశ దగ్గరలోకి వచ్చే సినిమా కూడా ఇంకొకటి ఉంటుందనుకోలేము.
  • 1965 లో NTR  నటించిన 12 సినిమాలు విడుదల అయ్యాయి. అందులో 8  శత దినోత్సవం జరుపుకున్నాయి.
  • జనవరి 13 1971 నాడు విడుదల అయిన దసరాబుల్లోడు దుమ్ము దులిపేశాడు. 25 కేంద్రాల్లో వంద రోజులు, 4 కేంద్రాల్లో 200 రోజులు, 1 కేంద్రంలో 365 ఆడింది.
  • సెప్టెంబర్ 24 1971 నాడు విడుదల అయిన ప్రేమ నగర్ చరిత్ర సృష్టించింది. 15 లక్షల ఖర్చుతో రూపొందిన ఈ సినిమా 50 లక్షలు వసూలు చేసి ANR సత్తా చాటింది.
     
  • మే ఒకటి 1974 న విడుదల అయిన కృష్ణ  నటించిన 100 వ చిత్రం అల్లూరి సీతారామరాజు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొంది 19 కేంద్రాల్లో  శత దినోత్సవం జరుపుకుంది.
  • తెలుగు సినిమా వసూళ్ళలో కోటి దాటిన మొదటి నాలుగు సినిమాలు:  లవకుశ,  దాన వీర శూర కర్ణ, అడవి రాముడు, యమగోల. (యమగోల విడుదల అయిన నెల రోజులకు ఇప్పటికి భయంకరమైనదిగా చెప్పుకొనే ఉప్పెన వచ్చింది..)
  • 1980 దసరాకు విడుదల అయిన సర్దార్ పాపారాయుడు రెచ్చి పోయాడు.  22 కేంద్రాల్లో వంద రోజులు, 5 కేంద్రాల్లో రజతోత్సవం , 2 చోట్ల 300 రోజులు ఆడింది
  • ఫిబ్రవరి 18 1981 నాడు మళ్ళీ రికార్డులన్నీ  బద్దలయ్యే సినిమా విడుదల అయింది. అదే అక్కినేని నటించిన  దాసరి మేఘసందేశం. ఈ సినిమా 32 కేంద్రాల్లో విడుదల అయి 30 కేంద్రాల్లో వంద రోజులాడింది. ఈ 30 లో 29 చోట్ల రజతోత్సవం జరుపుకుంది. 21 కేంద్రాల్లో 200 రోజులు, 12 కేంద్రాల్లో 250 రోజులు 10 కేంద్రాల్లో 300 రోజులు, 8 కేంద్రాల్లో 365 రోజులు, 5 కేంద్రాల్లో 60 వారాలు, 2 కేంద్రాల్లో 75 వారాలు ఆడింది. విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు కేంద్రాల్లో (షిఫ్టులతో) 525 రోజులు ఆడింది.
  • 28 అక్టోబరు 1983 నాడు మామూలు హీరో చిరంజీవిని మెగాస్టార్ గా చేసిన సినిమా ఖైదీ విడుదల అయింది. 35 ప్రింట్లతో విడుదల అయిన ఈ సినిమా 20 కేంద్రాల్లో   శత దినోత్సవం జరుపుకుంది.
  • ఇక స్టార్ హీరోలు ఎవరూ లేకుండా 1985 అక్టోబర్లో విడుదల అయి 25 కేంద్రాల్లో  శత దినోత్సవం జరుపుకున్న సినిమా ప్రతిఘటన. 


ఆధారం: పులగం చిన్నారాయణ గారి "ఆనాటి ఆనవాళ్ళు ", వికిపిడియా

3 comments:

Padmarpita said...

Its an informative post. Thank Q!

Divya said...
This comment has been removed by the author.
Anonymous said...

chala information gather chesav mamayya... kani appatilo chala cin 100 days datay kada ippudu yr ki 1 or 2 movies 100days adutunayi