మొత్తానికి మగధీర చూశాము. ఈ సినిమా చుట్టూ అల్లుకున్న ఉత్సాహాన్ని చూశాక ఎపుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఎదురు చూశాము.కాకపోతే 10 డాలర్లు మించి టికెట్టుకు పెట్టకూడదు అన్న స్వీయ నియమానికి కట్టుబడి మొదటి వారం అంతా కూడ ఆగాము. మా డిట్రాయిట్ లో రెండవ వారం 11 చేశారు నా ప్రాణానికి. అదేదో 10 చేసేసి ఉండొచ్చుగా నా బోంట్లకు ఇబ్బంది లేకుండా... :(. ఇంక ఇంట్లో మా అమ్మాయిల గొడవ మొదలు. ఒక్క డాలరే కదా వెళ్దాము అంటూ.. అవునూ కాదూ అన్న మా ఈ చర్చకు తెర దించింది మా ఆవిడ రంగ ప్రవేశం. 'మా' tv లో ఇచ్చిన ప్రచార హోరు పుణ్యమా అని మా ఆవిడ మనం వెళ్తున్నాము అని నిర్ణయం ప్రకటించేసింది. ఇంకా ఏమయినా అంటే, నన్ను వదిలేసి వాళ్ళు చూసేస్తారేమో అని ఏదో బలవంతంగా ఒప్పుకుంటున్నట్లుగా ఒప్పేసుకున్నాను. ఇదండీ పూర్వ రంగం.
ఇంక సినిమా విషయానికి వస్తే, స్థూలంగా చాలా బాగుంది.
తరతరాలుగా మన జాతి దౌర్భాగ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు కథలో. విజయేంద్ర ప్రసాదు గారికి సలాం.
ఒక బలవంతుడైన శత్రువు సరిహద్దులో ఉంటె, మన రాజు గారికి పోటీలు, వేడుకలు అవసరమయ్యాయి... దేశ సైన్యాధ్యక్షుడిని అవమానించి పంపెయ్యడం.. అలానే బాధ్యత లేని ఆ తండ్రి కూతురే కదా యువ రాణి గారు. దేశ రక్షణ కోసమని యజ్ఞం చేయ్యమంటే, ఆవిడకు తన పెళ్ళి మొగుడు ముఖ్యమయ్యారు...
క్షమించాలి ఇదేదో విమర్శ కాదు. ఇదే మన చరిత్ర. జయచంద్రుడు, పృధ్వీరాజు కలిసి ఉన్నంత కాలం ఘోరీ 16 సార్లు దండెత్తి కూడా ఏమీ చెయ్యలేక పోయాడు. (నాకర్థం కానిది అన్ని సార్లు ఎందుకు క్షమించేశారా అన్నది.). వీళ్ళిద్దరూ విడిపోగానే వచ్చాడు, ఎక్కడో గుజరాత్ లో ఉన్న సోమనాథ దేవాలయం దాకా నరుక్కుంటూ, దోచుకుంటూ వెళ్ళాడు.
ప్రస్తుతానికి వద్దాము. :)
సినిమా అంతా కూడా కన్నుల పండుగగా ఉంది. బాపు గారి సినిమాల గురించి అంటారు.. సినిమాలో ఏ ముక్క కట్ చేసినా కూడా, ఫ్రేం కట్టించుకునేలాగా ఉంటుందని. అలానే ఉంది మగధీర కూడా. చివరి సీను దాకా కూడా కనువిందుగా..
హాయిగా ఎంజాయ్ చేసాము దాదాపు చివరి సీను దాకా..చివర్లో ఆ హెలికాప్టరు వ్యవహారమే చాలా అసమంజసంగా ఉండింది. అఘోరా తో ఒక కత్తి ఇప్పించి "ఈ కత్తిని అతని గుండెల్లో దింపితే ఇంక అన్ని జన్మలకూ హీరోయిన్ నీదే" ..అలా ఒక డయలాగ్ చెప్పించి ఉంటే, "హాయిగా హెలికాప్టరు లోంచి ఒక తుపాకీ తీసుకొని కాల్చిపారెయ్యొచ్చుగా" అనే ఒక చచ్చు సందేహం నా బోంట్లకు వచ్చి ఉండేది కాదేమో కదా.. చివర్లోని హెలికాప్టర్‌తో చంపే వ్యవహారమే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. మిగతా సినిమా అంతా అలా లీనమైపోయి చూశాము... ఇక్కడకు వచ్చేసరికి..... :(
పాటల విషయానికి వస్తె, నా మొదటి బహుమతి 'పంచదార బొమ్మా. ఈ పాటకు సంబంధించి అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యం కానీ, సంగీతం కానీ, చిత్రీకరించిన తీరు కాని, హీరో హీరోయిన్లు కానీ అత్యద్భుతం. గాలి ఊపిరూదిందీ, నేల నడక పోసిందీ, చినుకు లాలపోసిందీ ఏంటయ్య నీ గొప్ప అంటే, అవి బతికున్నప్పుడే నీతో ఉంటాయి, నేను చితిలో కూడా నీతోడుంటాను... వాహ్.. చంద్రబోసు గారు మీకు నమస్కారం. ఇంత చక్కటి పాటను చుట్టూ ఓ 100 మందిని పెట్టి ఖూనీ చెయ్యకుండా, మనసుకు హత్తుకునేలా చిత్రీకరించిన రాజమౌళి గారికి హాట్సాఫ్.
ఇంక నటీ నటులంతా కూడా చక్కగా పండించారు. తండ్రిని మించిన తనయుడు అనిపించారు ఒకరు. ఎవరంటారా? అబ్బే చరణ్ కాదండీ..("తండ్రిని మించిన" అనిపించుకోవాలంటే ఇంకొంచెం టైము పడుతుందనుకుంటా చరణ్‌కు) రావు రమేష్ గారు. ఆయన సినిమాలు ఒక్కొక్కటీ చూస్తున్న కొద్దీ ఆయన నటన మీద అభిమానం అంతకంతకూ పెరుగుతోంది. చక్కటి నటన, చక్కటి వాక్పటిమ.
చరణ్ చాలా కష్టపడ్డాడు. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. నటన విషయం కూడా ఎక్కడా చెడగొట్టాడు అని అనలేము కానీ, ఇంకా చాలా ఎదగాలి. especially in the field of expression and dialogue delivery. But to be fair with him, this is only his second film. బంగారు కోడిపెట్టా పాటలో చిరంజీవి కనపడి చరణ్ కు అన్యాయమే చేశాడనిపించింది. ఇద్దరినీ పక్క పక్కన చూస్తూంటే, చిరులో ఉన్న ఏదో మెరుపు చరణ్ లో కనిపించలేదు.
ఈ విజయం అంతా నాదే అన్న అహం తలకెత్తుకోకుండా, కండల తో పాటు, వాచికం, అభినయం మీద ఇంకా కృషి చేస్తే చరణ్ ఒక మాంఛి నటుడుగా ఎదుగుతాడన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఉన్నది కాసేపే ఆయినా శ్రీహరి షేర్‌ఖాన్ పాత్రలో జీవించాడు. జాలరి పాత్ర గురించి పెద్దగా చెప్పేందుకేమీ లేదు.
ఇంక చివర్లో "film by rajamouli" అన్న ముద్ర మామూలుగా వేసుకున్నారు. అయ్యా రాజమౌళి గారూ మీసం మెలేసి భూనభోనాంతరాలు దద్దరిల్లేలా తొడగొట్టి అప్పుడు గుద్దండి ముద్ర. ముమ్మాటికీ ఇది రాజమౌళి సినిమా.
12 comments:
బాగా వ్రాసారు సమీక్షని. చదువుతూంటే అన్నీ నా అభిప్రాయాలే అచ్చు గుద్దినట్టుగా వ్రాశారనిపించింది :)
mm...........naaku oke oka daggara....loop hole kanipinchindi.charan ni senapathi ga chupi vunte baagundedi.endukante raaju gaaru charan meeda ekkuvaga depend ayinattu choopinchaaru ....ee raaju just sainikulaku traing ichhe atanai medda anta depend kaadu kada..........
naaku movie appude ayyinda anipinchindi.
bagundi mee review
బాగుందండీ మీ రివ్యూ.
నవీన్ గార్ల గారు,పుల్లాయన గారు, శ్రీ, నెనర్లు. :)
వినయ్ గారు, మీరు చెప్పింది బాగానే ఉంది. కాకపోతే సేనాపతి కన్నా అంగరక్షకుడు గా ఉంటే హీరోయిన్ కు దగ్గరగా ఉండటం కోసం అయ్యి ఉండొచ్చు కదా...
సేనాపతి కన్నా అంగరక్షకుడు గా ఉంటే హీరోయిన్ కు దగ్గరగా ఉండటం కోసం అయ్యి ఉండొచ్చు కదా..:) LOL
good review
బాగుంది రివ్యూ...
"తరతరాలుగా మన జాతి దౌర్భాగ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు కథలో" hahah కేక
హరే కృష్ణ gAru,
హరే కృష్ణ గారు, ప్రవీణ్ , కత్తి మహేష్ గారు నెనర్లు.
కత్తి మహేష్ గారు
ఈ రోజుకు కూడా ఇది వర్తిస్తుంది అనుకోవడానికి ఇప్పుడు నడుస్తున్న జగన్ వ్యవహారం కూడా ఒక ఉదాహరణ అనుకోవచ్చేమో కదా!!!
:)
సమీక్ష చాలా బాగుంది. మీరు సమీక్షించిన విషయాలకన్నా, మీరు వాడిన భాష నాకు బాగా నచ్చింది. స్నేహితుడెవరో సినిమా చూసొచ్చి కబుర్లు చెప్పినట్టుగా ఉంది.
Nice Review, Siva!
You shd write more frequently.
Post a Comment