Saturday, October 10, 2009

సమీక్ష - పుస్తకము: ఒక దళారీ పశ్చాత్తాపం

ఇది ౨౦౦౮ లో  చేసినది . :) 
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పుస్తక సమీక్ష
పుస్తకము: ఒక దళారీ పశ్చాత్తాపం
రచన: జాన్ పెర్కిన్స్, తెలుగు : కొణతం దిలీప్, ప్రచురణ:వీక్షణం పబ్లికేషన్స్-హైదరాబాద్
చర్చలో పాల్గొన్నవారు: మద్దిపాటి కృష్ణారావు, ఆరి శీతారామయ్య, అడుసుమిల్లి శివ,
సమీక్షకులు: అడుసుమిల్లి శివ

ఇంతకు ముందటి మా  DTLC  సమావేశంలో అనువాదం గురించి ఒక చర్చ జరిగింది. దానికి కొనసాగింపా అన్నట్లుగా ఈ పుస్తకం స్వేచ్చానువాదానికి ఒక మచ్చుతునకగా నిలిచింది. ఇంత మంచి అనువాదం చేసిన దిలీప్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. వేణు గారు అక్కడ రాసి ఉండక పోతే, ఇది దిలీప్ గారి మొదటి ప్రయత్నం అని ఎవరైనా చెప్పినా నమ్మడం చాలా కష్ఠం. అంత చక్కగా "చెయ్యి తిరిగిన అనువాదకుడిలా" తెలుగు చేశారు.
ఈ పుస్తకం ఇప్పటికే ఎంతో ప్రజాదరణ పొందిన సందర్భంగా, మాదొక చిన్న విన్నపం. తరువాతి ప్రచురణలో అయినా, దీని పూర్తి అనువాదం ఇస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
ఉదాహరణకి - ఇంగ్లీషులో ఉండి మీరు వదిలేసిన ఈ అంశం. మెయిన్ తో సౌదీ చేసుకున్న ఒప్పందం.
ఒప్పందం ప్రకారం, వారికి (మెయిన్) పూర్తిగా ఫర్నిష్ చేసిన ఒక కార్యాలయం సౌదీ లో ఉండాలి. అయితే ఈ కార్యాలయంలో వాడిన ఫర్నిచర్ అంతా కూడా, సౌదీలో కానీ, అమెరికాలో కానీ తయారై ఉండాలి. సౌదీ లో ఏమీ తయారు కావని అందరికీ తెలిసిందే. కాబట్టి కావలసిన ఫర్నిచర్ అంతా కూడా బోస్టన్ నుంచి బోయింగ్ 747 విమానంలో తరలించారు. (ఒప్పందం ఎంతో పారదర్శకంగా, న్యాయబద్దంగా  కనిపిస్తుంది కదా.. నిజానికి బాగుపడింది బోస్టన్ లోని ఫర్నిచర్ కంపెనీ, విమాన సర్వీసు వాళ్ళు).
70వ పేజీ, 14వ అధ్యాయం ఆర్థిక చరిత్రలో చరిత్రలో దారుణ ఘట్టం అని పేరు పెట్టారు. కానీ ఆ అధ్యాయం లో అలాంటి ఘట్టం ఎక్కడా కనిపించలేదు. ఒక సారి చూడగలరు.
మరి కొన్ని చిన్న చిన్న విషయాలు...
ఉదా: 74వ పేజీ  beautiful blonds ని "తెల్ల తోలు అమ్మాయిలు" అనడం,
అలానే, 75వ పేజీలో how to balance a check book ని చెక్ బుక్ పై రాయడం రాకపోవడం అనడంలో కొంచెం ఎక్కువ స్వేచ్చ తీసుకున్నట్లున్నారు :) చిన్న చిన్న విషయాలే అనుకోండి.. కానీ మన చొక్కా అనుకున్నాక చిన్న మరకే అని  శుభ్రం చేసుకోకుండా వదిలెయ్యము కదా.
అలానే 119వ పేజీలో చెప్పినట్లు రోల్డోస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించలేదు. ఒక టేపు రికార్డరు బాంబు వల్ల మరణించాడు. ఈ విషయాన్ని Confessions... తరువాతి ప్రచురణలలో సవరించారు.
ఏతావాతా ఒక మంచి పుస్తకాన్ని తెనిగించిన దిలీప్ గారికి, అందించిన వేణు గారికి హృదయపూర్వక అభినందనలతో  --  --శలవు.

Sunday, September 6, 2009

మగధీర - నా రివ్యూ

మొత్తానికి మగధీర చూశాము. ఈ సినిమా చుట్టూ అల్లుకున్న ఉత్సాహాన్ని చూశాక ఎపుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఎదురు చూశాము.కాకపోతే 10 డాలర్లు మించి టికెట్టుకు పెట్టకూడదు అన్న స్వీయ నియమానికి కట్టుబడి మొదటి వారం అంతా కూడ ఆగాము. మా డిట్రాయిట్ లో రెండవ వారం 11 చేశారు నా ప్రాణానికి. అదేదో 10 చేసేసి ఉండొచ్చుగా నా బోంట్లకు ఇబ్బంది లేకుండా... :(. ఇంక ఇంట్లో మా అమ్మాయిల గొడవ మొదలు. ఒక్క డాలరే కదా వెళ్దాము అంటూ.. అవునూ కాదూ అన్న మా ఈ చర్చకు తెర దించింది మా ఆవిడ రంగ ప్రవేశం. 'మా' tv లో ఇచ్చిన ప్రచార హోరు పుణ్యమా అని మా ఆవిడ మనం వెళ్తున్నాము అని నిర్ణయం ప్రకటించేసింది. ఇంకా ఏమయినా అంటే, నన్ను వదిలేసి వాళ్ళు చూసేస్తారేమో అని ఏదో బలవంతంగా ఒప్పుకుంటున్నట్లుగా ఒప్పేసుకున్నాను. ఇదండీ పూర్వ రంగం.

ఇంక సినిమా విషయానికి వస్తే, స్థూలంగా చాలా బాగుంది.
తరతరాలుగా మన జాతి దౌర్భాగ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు కథలో. విజయేంద్ర ప్రసాదు గారికి సలాం.
ఒక బలవంతుడైన శత్రువు సరిహద్దులో ఉంటె, మన రాజు గారికి పోటీలు, వేడుకలు అవసరమయ్యాయి... దేశ సైన్యాధ్యక్షుడిని అవమానించి పంపెయ్యడం.. అలానే బాధ్యత లేని ఆ తండ్రి కూతురే కదా యువ రాణి గారు. దేశ రక్షణ కోసమని యజ్ఞం చేయ్యమంటే, ఆవిడకు తన పెళ్ళి మొగుడు ముఖ్యమయ్యారు...
క్షమించాలి ఇదేదో విమర్శ కాదు. ఇదే మన చరిత్ర. జయచంద్రుడు, పృధ్వీరాజు కలిసి ఉన్నంత కాలం ఘోరీ 16 సార్లు దండెత్తి కూడా ఏమీ చెయ్యలేక పోయాడు. (నాకర్థం కానిది అన్ని సార్లు ఎందుకు క్షమించేశారా అన్నది.). వీళ్ళిద్దరూ విడిపోగానే వచ్చాడు, ఎక్కడో గుజరాత్ లో ఉన్న సోమనాథ దేవాలయం దాకా నరుక్కుంటూ, దోచుకుంటూ వెళ్ళాడు.
ప్రస్తుతానికి వద్దాము. :)
సినిమా అంతా కూడా కన్నుల పండుగగా ఉంది. బాపు గారి సినిమాల గురించి అంటారు.. సినిమాలో ఏ ముక్క కట్ చేసినా కూడా, ఫ్రేం కట్టించుకునేలాగా ఉంటుందని. అలానే ఉంది మగధీర కూడా. చివరి సీను దాకా కూడా కనువిందుగా..
హాయిగా ఎంజాయ్ చేసాము దాదాపు చివరి సీను దాకా..చివర్లో ఆ హెలికాప్టరు వ్యవహారమే చాలా అసమంజసంగా ఉండింది. అఘోరా తో ఒక కత్తి ఇప్పించి "ఈ కత్తిని అతని గుండెల్లో దింపితే ఇంక అన్ని జన్మలకూ హీరోయిన్ నీదే" ..అలా ఒక డయలాగ్ చెప్పించి ఉంటే, "హాయిగా హెలికాప్టరు లోంచి ఒక తుపాకీ తీసుకొని కాల్చిపారెయ్యొచ్చుగా" అనే ఒక చచ్చు సందేహం నా బోంట్లకు వచ్చి ఉండేది కాదేమో కదా.. చివర్లోని హెలికాప్టర్తో చంపే వ్యవహారమే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. మిగతా సినిమా అంతా అలా లీనమైపోయి చూశాము... ఇక్కడకు వచ్చేసరికి..... :(
పాటల విషయానికి వస్తె, నా మొదటి బహుమతి 'పంచదార బొమ్మా. ఈ పాటకు సంబంధించి అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యం కానీ, సంగీతం కానీ, చిత్రీకరించిన తీరు కాని, హీరో హీరోయిన్లు కానీ అత్యద్భుతం. గాలి ఊపిరూదిందీ, నేల నడక పోసిందీ, చినుకు లాలపోసిందీ ఏంటయ్య నీ గొప్ప అంటే, అవి బతికున్నప్పుడే నీతో ఉంటాయి, నేను చితిలో కూడా నీతోడుంటాను... వాహ్.. చంద్రబోసు గారు మీకు నమస్కారం. ఇంత చక్కటి పాటను చుట్టూ ఓ 100 మందిని పెట్టి ఖూనీ చెయ్యకుండా, మనసుకు హత్తుకునేలా చిత్రీకరించిన రాజమౌళి గారికి హాట్సాఫ్.
ఇంక నటీ నటులంతా కూడా చక్కగా పండించారు. తండ్రిని మించిన తనయుడు అనిపించారు ఒకరు. ఎవరంటారా? అబ్బే చరణ్ కాదండీ..("తండ్రిని మించిన" అనిపించుకోవాలంటే ఇంకొంచెం టైము పడుతుందనుకుంటా చరణ్కు) రావు రమేష్ గారు. ఆయన సినిమాలు ఒక్కొక్కటీ చూస్తున్న కొద్దీ ఆయన నటన మీద అభిమానం అంతకంతకూ పెరుగుతోంది. చక్కటి నటన, చక్కటి వాక్పటిమ.
చరణ్ చాలా కష్టపడ్డాడు. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. నటన విషయం కూడా ఎక్కడా చెడగొట్టాడు అని అనలేము కానీ, ఇంకా చాలా ఎదగాలి. especially in the field of expression and dialogue delivery. But to be fair with him, this is only his second film. బంగారు కోడిపెట్టా పాటలో చిరంజీవి కనపడి చరణ్ కు అన్యాయమే చేశాడనిపించింది. ఇద్దరినీ పక్క పక్కన చూస్తూంటే, చిరులో ఉన్న ఏదో మెరుపు చరణ్ లో కనిపించలేదు.
ఈ విజయం అంతా నాదే అన్న అహం తలకెత్తుకోకుండా, కండల తో పాటు, వాచికం, అభినయం మీద ఇంకా కృషి చేస్తే చరణ్ ఒక మాంఛి నటుడుగా ఎదుగుతాడన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఉన్నది కాసేపే ఆయినా శ్రీహరి  షేర్ఖాన్ పాత్రలో జీవించాడు.  జాలరి పాత్ర గురించి పెద్దగా చెప్పేందుకేమీ లేదు.

ఇంక చివర్లో "film by rajamouli" అన్న ముద్ర మామూలుగా వేసుకున్నారు. అయ్యా రాజమౌళి గారూ మీసం మెలేసి భూనభోనాంతరాలు దద్దరిల్లేలా తొడగొట్టి అప్పుడు గుద్దండి ముద్ర. ముమ్మాటికీ ఇది రాజమౌళి సినిమా.

Thursday, January 1, 2009

Banni Lands


బన్నీ భూములు అంటారు వీటిని. ఎక్కడ ఉన్నాయి ఇవి, అస్సలు ఏముందిక్కడ? అబ్బా అన్నీ ప్రశ్నలే.
ఇవి మన గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఉన్నాయి. ఎడారి మధ్యలో చిన్న చిన్న దీవుల లాగా కనిపిస్తున్నాయి కదా. నమ్మరు గాని, అక్కడ మనుషులు నివసిస్తున్నారు. ఒక్కొక్క patch ఒక habitat అన్న మాట. జెండా ఉన్న చోటు పేరు హోడ్కా (Hodka). అక్కడ కేవలం గడ్డి మాత్రమే పెరుగుతుంది. మరే విధమైన వ్యవసాయం కూడా ఉండదు. వీటినే banni lands అంటారు. మరి ప్రజల జీవనం అంటారా ... ఈ గడ్డి మీద బతికే గేదెల మీద వీరు బ్రతుకుతారు. అంటే పాలు, పశువులు (బన్నీ గేదెలు) మాత్రమే వీరికి ఆధారం. ఫై ఫొటో నుంచి, అలా జూం చేసుకుంటూ కిందకు వస్తే, అక్కడ గడ్డి ఇలా ఉంటుంది


ఇప్పుడు ఇదంతా ఒక మంచి ethnic Tourist place గా అభివృద్ది చేస్తున్నారు. ఒక మంచి అనుభవం కావాలంటే ఒకసారి తప్పకుండా చూడవలసిన ప్రదేశం. 
ఈ గడ్డిలో ఉండడానికి వెళ్ళాలా అనుకుంటున్నారా? ఇదొక మంచి యాత్రా కేంద్రంగా అభివృద్ధి చేశారు. అన్ని ఆధునిక సదుపాయాలతో ఉంటాయి క్రింద ఫొటో లొని కుటీరాలు.

వివరాలకు http://www.hodka.in/naturally4.htm