Thursday, March 24, 2011

ఒకటి


గణితంలో ఒకటి అన్న అంకె ఉంది. తక్కిన అంకెలన్నీ ఈ ఒకటి  యొక్క గుణిజాలే. అలాగే సంపూర్ణ సత్యం ఒక్కటే.జగత్తు యొక్క అన్ని పేర్లు, అన్ని రూపాలు ఆ ఒక్క సంపూర్ణ సత్యాన్ని స్పష్టపరిచే అనేక గుణాలు మాత్రమే.


అంతర్‌జ్ఙానము

మానవ మేధస్సు ఎంత వరకు అందుకోగలదో చూసేక దాని కతీతమైన శక్తి ఉన్నదని గ్రహిస్తాము.ఒక స్థితి చేరేకమేధస్సు మనకిక దారి చూపలేదు. అంతర్‌జ్ఙానమే మనలకిక దారి చూప గలదు.బుద్ధి పరీక్షిస్తుంది, లెక్కలేస్తుంది, నిర్ణయిస్తుంది,అంగీకరిస్తుంది (మరియు) మనసు లోపలజరిగే దానినంతటినీ నిరాకరిస్తుంది. కాని అంతర్‌జ్ఙానము లోతైన అంతరాళాలలో దాని మూలము నుండి, దానంతటాదే ప్రారంభమయే ఎటువంటి అవరోధాలు లేనిఒక ధార. ఎప్పుడైతే మనసు శాంతమైన, సమానత్వమైన, నిర్వికారమైన స్థితికిచేరుతుందో  అప్పుడే ఇది ప్రారంభమవుతుంది. వ్యక్తి అన్నింటినీతేట తెల్లంగా చూడడం పొరారంభించేటట్లుగా ఆ పవిత్రమైన అంతర్‌జ్ఙానము మానవ చైతన్యాన్ని విస్తరింపజేస్తుంది. అజ్ఙానము తొలగి, సంపూర్ణమైన జీవితం తెలుసుకొనబడుతుంది. అనేక అనుభవాల పిమ్మట స్వానుభవము మార్గదర్శీయి ఎటువంటి ప్రయత్నము లేకుండ వ్యక్తి అంతర్‌జ్ఙానాన్ని పొందడం ప్రారంభిస్తాడు.

Sunday, December 12, 2010

కల్హణ కశ్మీర రాజతరంగిణి  కథలు
11 వ శతాబ్దం నాటి కల్హణ విరచితమైన ’కశ్మీర రాజతరంగిణి’ ఆధారంగా రాసిన 16 కథలు.
రచయిత: కస్తూరి మురళీ కృష్ణ
ప్రచురించిన వారి చిరునామా:
ఎమెస్కో బుక్స్
సూర్యారావు పేట, విజయవాడ - 520 002.
ధర: 90/-

2010 జనవరి లో డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ లో జరిగిన చర్చా సమీక్ష. సమీక్ష రాసి పంపిన వారు:  అడుసుమిల్లి శివ


2008 లో అనుకుంటా. విజయవాడలో నా సెలవుల ఆఖరు రోజున యధావిధిగా ఎమెస్కో వారి దుకాణానికి వెళ్ళాను. అక్కడ వెదుకుతూ  ఉండగా ఎరుపు నలువు రంగుల్లో చాలా అందంగా  ఉన్న ఒక పుస్తకం కనబడింది. తీసి చూస్తే కల్హణ కశ్మీర రాజతరంగిణి... అని కనపడగానే చాలా సంతోషం వేసింది. ఎన్నాళ్ళగానో చదవాలనుకుంటున్న ఒక పుస్తకం కనపడిన ఆనందం అన్నమాట.  వెనుక అట్టమీద రచయిత పరిచయం, తిరగేస్తూ ఉంటే కనబడిన బొమ్మలు చాలా బాగా నచ్చి కొనుక్కొని నాతో తెచ్చుకున్నాను. మా డిట్రాయిట్ వచ్చేసరికి దాదాపు చదివేశాను. శైలి ఒక చిన్న ప్రవాహం లాగా అందంగా సాగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చదువుతూ చదువుతూ ఒక రకమయిన ఉద్వేగానికి లోనయ్యాను. ఈ నాడు కళ్ళముందు కనపడుతున్న అనేక విషయాలను ఎప్పుడో 11 వ శతాబ్దం నాటి కల్హణుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు కదా అనుకున్నాను.

మా  DTLC 2009లో చదివే పుస్తకాల జాబితాలో చేర్చుదామనుకున్నా కాని కుదరలేదు.  2010 పుస్తకాల జాబితాలో చేర్చాము. పోయిన డిశెంబరు చివర్లో అనుకుంటా మద్దిపాటి  కృష్ణారావు గారు ఫోను చేసి ఈ పుస్తకం సిఫారసు చేసింది మీరే కదా మరి మీరే దీనికి ముఖ్య చదువరి గా ఉండండి అంటే హుషారుగా ఒప్పేసుకున్నాను (ముఖ్య చదువరి అంటే చర్చ ప్రారంభించి, చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయాలు సేకరించి, చర్చా సారాంశాన్ని సమీక్షగా రాసే సభ్యుడు). కాని ఆ ఆనందం, ఆ హుషారు చాలా short lived మాత్రమే అని ఒక కలము కాగితము పక్కన పెట్టుకొని ప్రశాంతంగా చదువుతూంటే గాని తెలియలేదు.

ఒక పుస్తకం పేరు వల్లకాని, రచయిత పేరు వల్ల కాని, లేదా అందమయిన అట్టవల్లకాని, అట్టవెనుక ఉన్న పరిచయ వాక్యాలవల్ల కాని, లేదా దానిలో ఉన్న విషయం పట్ల మనకున్న ఆసక్తి వల్ల కాని మనం ఆకర్షితులమయి పుస్తకం కొని తెచ్చుకొని చదవటం మొదలు పెడతాము. ఒక సారి పుస్తకం తెరిచిన తర్వాత మనల్ని ముందుకు నడిపించే బాధ్యత పూర్తిగా రచయితదే కదా!  మనలను చేయి పట్టుకొని భద్రంగా నడిపించే బాధ్యత రచయిత చేతిలో పెట్టాక  ఇంక మనం ఆ పుస్తకం లోని మాధుర్యాలను ఆస్వాదించడానికి సిద్దపడతాము.

కాని ఇక్కడ జరిగిందేమిటంటే ఎంతో దూరం ప్రయాణించకముందే, అంటే ఇంకా మొదటి కథ కూడ పూర్తికాకముందే తలకు బొప్పికట్టడాలు, కాళ్ళకు ఎదురుదెబ్బలు తగలడాలు, మోకాలు చిప్పలు పగలడాలు వగయిరాలు జరిగేసరికి ఇంక రచయిత మనలను భద్రంగా నడిపిస్తాడు అన్న నమ్మకం సడలిపోతుంది. ఇంకేముంది. ఇక దృష్టి అంతా కూడ జాగ్రత్త మీదకు మళ్ళి ఎదురుదెబ్బలు తగలకుండా కాపాడుకునే ప్రయత్నంలో దారిలో అక్కడక్కడా ఉన్నసుమాల సౌరభాన్ని గాని, నేతిగిన్నెల్లో దొరికిన మాధుర్యాన్ని గాని ఆస్వాదించలేక పోతాము. అలసిసొలసిన బాటసారులం హుష్షో హష్షో  అనుకుంటూ ఒకచోట చేరినప్పుడు అదుగో అక్కడ ఒక గిన్నెలో తేనె ఉంది చూశారా అని ఎవరైనా అడిగినా కష్టపడి గుర్తు తెచ్చుకునో, లేదా వారి సాయంతో అక్కడకు జాగ్రత్తగా వెనక్కు వెళ్ళో చూడాల్సి వస్తుంది.
మొత్తానికి ప్రయాణం ముగించడానికే శక్తి యుక్తులన్నీ ఖర్చయిపోతాయి.
టూకీగా ఇదీ సంగతి.

కొంచెం వివరంగా....
ఒక మంచి ఎడిటరు లేని లోపమయితే కొట్టొచ్చినట్లు కనపడుతుంది.  ఒక మంచి ఎడిటరు ఉండి ఉన్నట్లయితే, ప్రతి పేజీలో ఉన్న ఎన్నో అచ్చుతప్పులూ, అసంబద్ధవాక్యాలూ, ముఖ్యంగా చాలా చోట్ల prepositions miss అయ్యాయి, ఇవన్నీ కూడ సరిచేసుకునే అవకాశం ఉండేదేమో. అట్ట మీద  ఒక సగంలో ప్రాచీనానికి చిహ్నంగా నలుపు రంగులో ఒక శిల్పము,  మిగతా సగంలో ఆధునికతకు చిహ్నంగా ఎరుపు రంగు చక్కగా ఉన్నాయి. లోపల మాత్రం ఎక్కడా కూడా కల్హణుడికీ, కస్తూరి వారికీ మధ్యన గీత దాదాపు కనపడలేదు. ఏది చరిత్ర, ఏది కల్పితం అంతా అయోమయం.  ఇక ఇందులో పేర్కొన్న సంవత్సరాలు, చరిత్ర, బౌద్ధం అంతా ఇంకా పెద్ద గందరగోళం. ఈ గందరగోళం లో పడి ఉన్న కొన్ని మంచి కథలు కూడ మరుగున పడిపోయాయి.

ఉదాహరణకు, బుద్దుడు పుట్టినది 400-600 BCE మధ్య కాలంలో అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి కస్తూరి వారు క్రీ.పూ 1887 అని చెప్తారు.  నలుగురితో నారాయణ అనాలంటే ఎక్కువ వివరణలు అవసరం లేదు. కాని ఇలా పూర్తిగా విభేదించేప్పుడు కొంచెం footnotes లాగ ఏమయినా ఇచ్చి ఉంటే,  మాబోంట్లకు ఈ అయోమయం తప్పేది కదా!!

ఇంకొంచెం వివరంగా:
9  పేజీ: "బలరాముడు జరాసంధునికి సహాయంగా కశ్మీర సైన్యంపై విరుచుకు పడ్డాడు"...........          ఢాం
బహుశః  రచయిత ఉద్దేశ్యం  సహాయంగా వచ్చిన ...... అని అనుకుంటా

10 పేజీ:  తురుష్క అంటే మహమ్మదీయ మతం కాదు అని వివరణ ఇచ్చారు బాగానే ఉంది. కాని మళ్ళీ తర్వాత్తర్వాత అదే తురుష్క పదాన్ని మహమ్మదీయ మతానికి ప్రత్యామ్నాయంగా వాడారు.

12 పేజీ:   "ఇంతలో మరో వార్త ".
అసలు ఒక వార్త ఉన్నప్పుడు కదా మరో వార్త ఉండేది.
"శ్రీకృష్ణమంత్రి నుంచి"  అంటారు.    అంటే శ్రీకృష్ణ అనే మంత్రా? లేక శ్రీకృష్ణుని మంత్రా?

16 పేజీ:
"తుఫాను అలల తాకిడికి నావ వణికినట్లు" ... ఈ ప్రయోగం కొంచెం ఎబ్బెట్టుగా లేదూ!
ఒక సంభాషణ చెప్పినప్పుడు " " మధ్యన ఉన్నది ఒక పేరాలో ఉంటే, దాని స్పందన మరొక పేరాలో ఉంటే బాగుండేదేమో! పుస్తకమంతా కూడా ఇలానే సాగింది.

17 పేజీ :
"శౌర్యంలో నరేంద్రుడంతటి వాడు ".
ఈ నరేంద్రుడు ఎవరండీ? నరేంద్రుడు అంటేనే నరులలో ఇంద్రుడంతటి వాడు అన్న ఒక పొగడ్త కదా. మరింక  ఈ ప్రయోగం?

25 పేజీ :
క్రీ.పూ.15 వ శతాబ్దం అంటారు. మళ్ళీ తుర్కీ నుంచి వచ్చిన బౌద్ద పండిత మహారాజు అంటారు. అందరికీ తెలిసిన బుద్దుడి కాలం 6 - 4 శతాబ్దాల మధ్య కదా. ఇక్కడ వివరణ లాంటిది ఇచ్చి ఉండాలిసిందేమో!!
33 వపేజీ  
"చిన్న సముద్రమంత సరస్సు"             :)
"గోనందుని నుండి లవ మహారాజు వరకు 35 మంది రాజులు పాలించారు. తర్వాత కుశుడు, ఖగేంద్రుడు, సురేంద్రుడు రాజయ్యారు. "  రాజులయ్యారు కాబోలు...
"శచీనరుని తర్వాత గాంధారి సోదరుడి  మునిమనుమడు ’అశోక చక్రవర్తి రాజయ్యాడు."
"దామోదరుడు కృష్ణుని సుదర్శనానికి బలయ్యాడు. అతని కొడుకు గోనందుడు మొదలుకొని  లవుడి వరకు 35 రాజులు పాలించారు. తర్వాత కుశుడు, ఖగేంద్రుడు, సురేంద్రుడు, గోధరుడు, సువర్ణ మహారాజు, జనకుడు, శచీ నరుడు"
... అంటే 42 మంది రాజులయ్యారు. తర్వాత శకుని ముని మనుమడు అశోకుడు? 42 మంది రాజులు, సుమారు 1500 సంవత్సరాలు గడిచాయి. ఇంకా శకుని ముని మనుమడు?  మేము ఏదో miss అయినట్లున్నాము ఇక్కడ. లేదా ఇంత అసమంజసమా?

36 వపేజీ  
మ్లేచ్చులు అంటే వేదభ్రష్టులయిన భారతీయులు అని చెప్పారు. అంటే అశోకుడు కూడ మ్లేచ్చుడేనా?

37 పేజీ:
బౌద్ధులు అంతా సన్యాసులు అంటారు.  మళ్ళీ  రాజు, ఇంకా ఊళ్ళో అంతా బౌద్దులు అంటారు. ఎలా సాధ్యం?

జలౌక మహారాజు అద్భుత జీవితం.
46 పేజీ:  
మళ్ళీ సంవత్సరాల  అయోమయం.  కథ బాగున్నా కానీ  ఇది చరిత్రా, కల్పనా అన్న మీమాంస ఎక్కువ అయి ఆనందించలేక పోయాము.

66 పేజీ:
నౌకా యానాలు? పర్వతాల మధ్యన ఉన్న కశ్మీర నదులు నౌకాయానానికి అనుకూలమయినవేనా? ఒక వేళ అయి ఉంటే కొంచెం వివరణ ఉపయోగపడేది.

67 పేజీ:
మొలచిన గడ్డిగింజలు తినడం. మొలిస్తే ఇక గింజలెక్కడ?

68 పేజీ:
"వడగండ్ల వాన కురిపించి పంటలను పండించి"
         ??? వడగండ్ల వాన పడితే పంటలు నాశనం అవుతాయి కదా!!

68 పేజీ:
 "నరుడు అనబడే కిన్నరుడు "    
అన్నారు బాగానే ఉంది. కాని ఒకసారి నరుడు, మరొకసారి కిన్నరుడు అంటూ మార్చి వాడేసరికి చాలా ఇబ్బంది అనిపించింది.

72 పేజీ: "బండలు పడ్డ అయిదు ఆమడల వైశాల్యం వరకూ గ్రామాలు అరణ్యాలుగా మారిపోయాయి" .   అయ్యా!! ఎలా??

82 వ పేజీ:
"స్వధర్మం, కర్తవ్యం అయిన ధర్మయుద్దం చేయకపోతే ధర్మహాని.. కర్తవ్యలోపం వంటి పాపాలు చేసినట్లు అవుతుందని భగవదాజ్ఞ " .
ఎక్కడ స్వామీ!   "స్వధర్మో నిగుణం శ్రేయః.... " దీని అర్థమా ఇది??

101 పేజీ:
"పక్షిని ఈదమనడం, చేపను గాలిలో ఎగరమనడం మూర్ఖత్వం".
ఏమి చెప్పదలిచారు ఇక్కడ?

129 పేజీ:
"భోజరాజు జయించి ఆక్రమించిన ధక్కేయ వంశపు రాజు రాజ్యాన్ని గెలుచుకొని మళ్ళీ రాజ్యాన్ని ధక్కేయులకే అప్పగించారు. "
 నాకయితే అస్సలు అర్థం కాలేదు. అజ్ఞానానికి మన్నించండి.

145  పేజీ:
"భారతీయ ధర్మంలో స్త్రీ అబల అని నిరూపిస్తుంది సావిత్రి."                --మళ్ళీ ఢాం

ఇంక ఇది కేవలం తప్పుల పట్టిక లాగ అవుతోంది. ఇక ఇక్కడికి చాలిస్తాను.

ముగించేముందు  నాకు నచ్చిన ఒక పేరా
" భూమిపై మొలచి ఆకాశాన్నంటేట్లు ఎదిగిన ఈ చెట్లు మనిషి సాధన ద్వారా మనీషిగా ఎదగవచ్చన్న నిజాన్ని మౌనంగా ప్రదర్శిస్తున్నాయి. అంతేకాదు ఒక రాజు ఎంత ఎదిగినా అతని వ్రేళ్ళు భూమి మీదనే ఉండాలని, సామాన్యులను కూడా అతను గౌరవించాలనీ సూచిస్తున్నాయా చెట్లు. ఎందుకంటే సామాన్యుల రాజభక్తే రాజు శక్తి."

మా DTLC సమావేశాల్లో ఒక పుస్తకాన్ని సమీక్షించడానికి కూర్చున్నప్పుడు సాధారణంగా కొంతమందికి బాగ నచ్చి కొంతమందికి నచ్చక  మాంచి వాద ప్రతివాదాలు నడుస్తాయి.  ఎవరి వాదాన్ని, ఎవరి పరిశీలనను వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటే మా లైబ్రరీ వాళ్ళు ఇంక మూసేస్తున్నాము అనేదాక అస్సలు 3 గంటల సమయం గడచినట్లే తెలిసేది కాదు. కాని ఈ పుస్తకం విషయానికి వచ్చేసరికి అందరిదీ ఏకాభిప్రాయమే. ఎప్పుడూ లేనిది మాకు సమయం కూడ మిగిలిపోయింది.  ఆ ఏకాభిప్రాయాన్నే ఐదవ పేజీలో కస్తూరి వారు స్వయంగా ఇచ్చిన అనుమతి మేరకు  ఇక్కడ టూకీగా తెలియజెప్పే ప్రయత్నం చేశాను.

Sunday, January 24, 2010

శరీరము - ఆత్మ

నిన్న అనుకుంటా మన TV9 లో ఒకాయన జన్మల గురించి చెబుతూ, జీవి ఒక శరీరము నుంచి మరొక శరీరం లోనికి వెళ్ళడము అనే దానికి ఒక ఉదాహరణ లాగ చెప్పారు.
ఒక మాతృమూర్తి తన బిడ్డకు స్తన్యమిస్తూ, ఒక రొమ్ములో పాలు అయిపోయాయి అని గమనించి పొత్తిళ్ళలోని బిడ్డను ఒక రొమ్ము నుంచి మరొక రొమ్ముకు మార్చడం వంటిది అంట జీవుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని పొందడం అనేది.

చక్కగా చెప్పారు కదా! క్షమించాలి వారి పేరు గుర్తు లేదు.

Saturday, October 10, 2009

సమీక్ష - పుస్తకము: ఒక దళారీ పశ్చాత్తాపం

ఇది ౨౦౦౮ లో  చేసినది . :) 
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పుస్తక సమీక్ష
పుస్తకము: ఒక దళారీ పశ్చాత్తాపం
రచన: జాన్ పెర్కిన్స్, తెలుగు : కొణతం దిలీప్, ప్రచురణ:వీక్షణం పబ్లికేషన్స్-హైదరాబాద్
చర్చలో పాల్గొన్నవారు: మద్దిపాటి కృష్ణారావు, ఆరి శీతారామయ్య, అడుసుమిల్లి శివ,
సమీక్షకులు: అడుసుమిల్లి శివ

ఇంతకు ముందటి మా  DTLC  సమావేశంలో అనువాదం గురించి ఒక చర్చ జరిగింది. దానికి కొనసాగింపా అన్నట్లుగా ఈ పుస్తకం స్వేచ్చానువాదానికి ఒక మచ్చుతునకగా నిలిచింది. ఇంత మంచి అనువాదం చేసిన దిలీప్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. వేణు గారు అక్కడ రాసి ఉండక పోతే, ఇది దిలీప్ గారి మొదటి ప్రయత్నం అని ఎవరైనా చెప్పినా నమ్మడం చాలా కష్ఠం. అంత చక్కగా "చెయ్యి తిరిగిన అనువాదకుడిలా" తెలుగు చేశారు.
ఈ పుస్తకం ఇప్పటికే ఎంతో ప్రజాదరణ పొందిన సందర్భంగా, మాదొక చిన్న విన్నపం. తరువాతి ప్రచురణలో అయినా, దీని పూర్తి అనువాదం ఇస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
ఉదాహరణకి - ఇంగ్లీషులో ఉండి మీరు వదిలేసిన ఈ అంశం. మెయిన్ తో సౌదీ చేసుకున్న ఒప్పందం.
ఒప్పందం ప్రకారం, వారికి (మెయిన్) పూర్తిగా ఫర్నిష్ చేసిన ఒక కార్యాలయం సౌదీ లో ఉండాలి. అయితే ఈ కార్యాలయంలో వాడిన ఫర్నిచర్ అంతా కూడా, సౌదీలో కానీ, అమెరికాలో కానీ తయారై ఉండాలి. సౌదీ లో ఏమీ తయారు కావని అందరికీ తెలిసిందే. కాబట్టి కావలసిన ఫర్నిచర్ అంతా కూడా బోస్టన్ నుంచి బోయింగ్ 747 విమానంలో తరలించారు. (ఒప్పందం ఎంతో పారదర్శకంగా, న్యాయబద్దంగా  కనిపిస్తుంది కదా.. నిజానికి బాగుపడింది బోస్టన్ లోని ఫర్నిచర్ కంపెనీ, విమాన సర్వీసు వాళ్ళు).
70వ పేజీ, 14వ అధ్యాయం ఆర్థిక చరిత్రలో చరిత్రలో దారుణ ఘట్టం అని పేరు పెట్టారు. కానీ ఆ అధ్యాయం లో అలాంటి ఘట్టం ఎక్కడా కనిపించలేదు. ఒక సారి చూడగలరు.
మరి కొన్ని చిన్న చిన్న విషయాలు...
ఉదా: 74వ పేజీ  beautiful blonds ని "తెల్ల తోలు అమ్మాయిలు" అనడం,
అలానే, 75వ పేజీలో how to balance a check book ని చెక్ బుక్ పై రాయడం రాకపోవడం అనడంలో కొంచెం ఎక్కువ స్వేచ్చ తీసుకున్నట్లున్నారు :) చిన్న చిన్న విషయాలే అనుకోండి.. కానీ మన చొక్కా అనుకున్నాక చిన్న మరకే అని  శుభ్రం చేసుకోకుండా వదిలెయ్యము కదా.
అలానే 119వ పేజీలో చెప్పినట్లు రోల్డోస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించలేదు. ఒక టేపు రికార్డరు బాంబు వల్ల మరణించాడు. ఈ విషయాన్ని Confessions... తరువాతి ప్రచురణలలో సవరించారు.
ఏతావాతా ఒక మంచి పుస్తకాన్ని తెనిగించిన దిలీప్ గారికి, అందించిన వేణు గారికి హృదయపూర్వక అభినందనలతో  --  --శలవు.

Sunday, September 6, 2009

మగధీర - నా రివ్యూ

మొత్తానికి మగధీర చూశాము. ఈ సినిమా చుట్టూ అల్లుకున్న ఉత్సాహాన్ని చూశాక ఎపుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఎదురు చూశాము.కాకపోతే 10 డాలర్లు మించి టికెట్టుకు పెట్టకూడదు అన్న స్వీయ నియమానికి కట్టుబడి మొదటి వారం అంతా కూడ ఆగాము. మా డిట్రాయిట్ లో రెండవ వారం 11 చేశారు నా ప్రాణానికి. అదేదో 10 చేసేసి ఉండొచ్చుగా నా బోంట్లకు ఇబ్బంది లేకుండా... :(. ఇంక ఇంట్లో మా అమ్మాయిల గొడవ మొదలు. ఒక్క డాలరే కదా వెళ్దాము అంటూ.. అవునూ కాదూ అన్న మా ఈ చర్చకు తెర దించింది మా ఆవిడ రంగ ప్రవేశం. 'మా' tv లో ఇచ్చిన ప్రచార హోరు పుణ్యమా అని మా ఆవిడ మనం వెళ్తున్నాము అని నిర్ణయం ప్రకటించేసింది. ఇంకా ఏమయినా అంటే, నన్ను వదిలేసి వాళ్ళు చూసేస్తారేమో అని ఏదో బలవంతంగా ఒప్పుకుంటున్నట్లుగా ఒప్పేసుకున్నాను. ఇదండీ పూర్వ రంగం.

ఇంక సినిమా విషయానికి వస్తే, స్థూలంగా చాలా బాగుంది.
తరతరాలుగా మన జాతి దౌర్భాగ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు కథలో. విజయేంద్ర ప్రసాదు గారికి సలాం.
ఒక బలవంతుడైన శత్రువు సరిహద్దులో ఉంటె, మన రాజు గారికి పోటీలు, వేడుకలు అవసరమయ్యాయి... దేశ సైన్యాధ్యక్షుడిని అవమానించి పంపెయ్యడం.. అలానే బాధ్యత లేని ఆ తండ్రి కూతురే కదా యువ రాణి గారు. దేశ రక్షణ కోసమని యజ్ఞం చేయ్యమంటే, ఆవిడకు తన పెళ్ళి మొగుడు ముఖ్యమయ్యారు...
క్షమించాలి ఇదేదో విమర్శ కాదు. ఇదే మన చరిత్ర. జయచంద్రుడు, పృధ్వీరాజు కలిసి ఉన్నంత కాలం ఘోరీ 16 సార్లు దండెత్తి కూడా ఏమీ చెయ్యలేక పోయాడు. (నాకర్థం కానిది అన్ని సార్లు ఎందుకు క్షమించేశారా అన్నది.). వీళ్ళిద్దరూ విడిపోగానే వచ్చాడు, ఎక్కడో గుజరాత్ లో ఉన్న సోమనాథ దేవాలయం దాకా నరుక్కుంటూ, దోచుకుంటూ వెళ్ళాడు.
ప్రస్తుతానికి వద్దాము. :)
సినిమా అంతా కూడా కన్నుల పండుగగా ఉంది. బాపు గారి సినిమాల గురించి అంటారు.. సినిమాలో ఏ ముక్క కట్ చేసినా కూడా, ఫ్రేం కట్టించుకునేలాగా ఉంటుందని. అలానే ఉంది మగధీర కూడా. చివరి సీను దాకా కూడా కనువిందుగా..
హాయిగా ఎంజాయ్ చేసాము దాదాపు చివరి సీను దాకా..చివర్లో ఆ హెలికాప్టరు వ్యవహారమే చాలా అసమంజసంగా ఉండింది. అఘోరా తో ఒక కత్తి ఇప్పించి "ఈ కత్తిని అతని గుండెల్లో దింపితే ఇంక అన్ని జన్మలకూ హీరోయిన్ నీదే" ..అలా ఒక డయలాగ్ చెప్పించి ఉంటే, "హాయిగా హెలికాప్టరు లోంచి ఒక తుపాకీ తీసుకొని కాల్చిపారెయ్యొచ్చుగా" అనే ఒక చచ్చు సందేహం నా బోంట్లకు వచ్చి ఉండేది కాదేమో కదా.. చివర్లోని హెలికాప్టర్తో చంపే వ్యవహారమే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. మిగతా సినిమా అంతా అలా లీనమైపోయి చూశాము... ఇక్కడకు వచ్చేసరికి..... :(
పాటల విషయానికి వస్తె, నా మొదటి బహుమతి 'పంచదార బొమ్మా. ఈ పాటకు సంబంధించి అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యం కానీ, సంగీతం కానీ, చిత్రీకరించిన తీరు కాని, హీరో హీరోయిన్లు కానీ అత్యద్భుతం. గాలి ఊపిరూదిందీ, నేల నడక పోసిందీ, చినుకు లాలపోసిందీ ఏంటయ్య నీ గొప్ప అంటే, అవి బతికున్నప్పుడే నీతో ఉంటాయి, నేను చితిలో కూడా నీతోడుంటాను... వాహ్.. చంద్రబోసు గారు మీకు నమస్కారం. ఇంత చక్కటి పాటను చుట్టూ ఓ 100 మందిని పెట్టి ఖూనీ చెయ్యకుండా, మనసుకు హత్తుకునేలా చిత్రీకరించిన రాజమౌళి గారికి హాట్సాఫ్.
ఇంక నటీ నటులంతా కూడా చక్కగా పండించారు. తండ్రిని మించిన తనయుడు అనిపించారు ఒకరు. ఎవరంటారా? అబ్బే చరణ్ కాదండీ..("తండ్రిని మించిన" అనిపించుకోవాలంటే ఇంకొంచెం టైము పడుతుందనుకుంటా చరణ్కు) రావు రమేష్ గారు. ఆయన సినిమాలు ఒక్కొక్కటీ చూస్తున్న కొద్దీ ఆయన నటన మీద అభిమానం అంతకంతకూ పెరుగుతోంది. చక్కటి నటన, చక్కటి వాక్పటిమ.
చరణ్ చాలా కష్టపడ్డాడు. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. నటన విషయం కూడా ఎక్కడా చెడగొట్టాడు అని అనలేము కానీ, ఇంకా చాలా ఎదగాలి. especially in the field of expression and dialogue delivery. But to be fair with him, this is only his second film. బంగారు కోడిపెట్టా పాటలో చిరంజీవి కనపడి చరణ్ కు అన్యాయమే చేశాడనిపించింది. ఇద్దరినీ పక్క పక్కన చూస్తూంటే, చిరులో ఉన్న ఏదో మెరుపు చరణ్ లో కనిపించలేదు.
ఈ విజయం అంతా నాదే అన్న అహం తలకెత్తుకోకుండా, కండల తో పాటు, వాచికం, అభినయం మీద ఇంకా కృషి చేస్తే చరణ్ ఒక మాంఛి నటుడుగా ఎదుగుతాడన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఉన్నది కాసేపే ఆయినా శ్రీహరి  షేర్ఖాన్ పాత్రలో జీవించాడు.  జాలరి పాత్ర గురించి పెద్దగా చెప్పేందుకేమీ లేదు.

ఇంక చివర్లో "film by rajamouli" అన్న ముద్ర మామూలుగా వేసుకున్నారు. అయ్యా రాజమౌళి గారూ మీసం మెలేసి భూనభోనాంతరాలు దద్దరిల్లేలా తొడగొట్టి అప్పుడు గుద్దండి ముద్ర. ముమ్మాటికీ ఇది రాజమౌళి సినిమా.